EAMCET 2024 – మే రెండోవారంలో ఎంసెట్‌ పరీక్ష

తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌తోపాటు వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరంలో నిర్వహించే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ, నోటిఫికేషన్‌ విడుదల, రాతపరీక్షల తేదీలు వంటి అంశాలపై బుధవారం సచివాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం సమావేశాన్ని నిర్వహించారు.

ఫిబ్రవరిలో ఎంసెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది. మే రెండో వారంలో ఎంసెట్‌ రాతపరీక్షలను (EAMCET 2024 WILL CONDUCT ON MAY 2nd week ) నిర్వహించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఐసెట్‌, ఈసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌ రాతపరీక్షల తేదీలు, నోటిఫికేషన్లపైనా చర్చించినట్టు తెలిసింది.

కన్వీనర్ల నియామకం, సెట్స్‌ కమిటీల ఏర్పాటు, సమావేశాల నిర్వహణ వంటి అంశాలను ముఖ్యకార్యదర్శి దృష్టికి తెచ్చారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE 2024) రాత పరీక్షలకు ఇబ్బంది లేకుండా ఎంసెట్‌ షెడ్యూల్‌ను తయారు చేస్తారు.

జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మొదటి విడత, ఏప్రిల్‌ ఒకటి నుంచి 15 వరకు రెండో విడత రాతపరీక్షలు జరుగుతాయని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది. అయితే విద్యార్థులు ఎంసెట్‌కు సన్నద్ధం అయ్యేందుకు కొంత సమయం ఇచ్చి రాతపరీక్షలను నిర్వహించే అవకాశమున్నది. అందుకే మే రెండో వారంలో ఎంసెట్‌ రాతపరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ఆర్‌ లింబాద్రి, వైస్‌ చైర్మెన్లు వి వెంకటరమణ, ఎస్‌కే మహమూద్‌, కార్యదర్శి ఎన్‌ శ్రీనివాసరావు హాజరయ్యారు.

Leave a Comment