MEGA DSC – 7,000 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌

ప్రస్తుతం DSC నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్న 5,089 పోస్టులకు అదనంగా దాదాపు 7 వేల పోస్టులతో మెగా డీఎస్సీ కొరకు అనుబంధ నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం. దీంతో దాదాపు 12 వేల టీచర్ పోస్టులు (mega dsc with 12,000 posts in telangana) కానున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శనివారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. నిజానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2017లో 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

దాదాపు ఏడేళ్ల తర్వాత 6,612 టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని మూడు నెలల కిందట బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ ఫర్‌ డిజేబుల్డ్‌లో మరో 1,523 పోస్టులున్నట్టు ప్రకటించింది. వీటిని డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది.

స్పెషల్‌ టీచర్‌ పోస్టులైన 1,523 ఖాళీలను పట్టించుకోకుండా 5,089 పోస్టుల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు ఎక్కడిక్కడ నోటిఫికేషన్‌ను జారీ చేశారు కూడా. వీటికి మొత్తం 1,77,502 మంది దరఖాస్తులు చేసుకున్నారు.

ఈ పోస్టులకు నవంబరు 20 నుంచి 30 వరకు పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ రావడంతో వాటిని వాయిదా వేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పుడు పోస్టుల భర్తీపై దృష్టిసారించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న 5,089 పోస్టులకు అదనంగా మరో 4,281 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు.

గతంలో ప్రకటించిన 1,523 స్పెషల్‌ పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. వీటితోపాటు మోడల్‌ స్కూల్స్‌లో మరో 1,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే, మరో 400 పోస్టులు ఇటీవల పదోన్నతుల ద్వారా ఖాళీ అయ్యాయి.

మొత్తంగా 12 వేల పోస్టులకుపైగా భర్తీ చేయడానికి తాజాగా అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. తద్వారా గతంలో దరఖాస్తు చేసిన వారు కూడా అర్హులవుతారు. కొత్త అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది

Leave a Comment